- 70 నుంచి 90 శాతం సబ్సిడీ పై వెహికల్స్, సోలార్ పంపు సెట్లు
- ఉమ్మడి నల్గొండకు 929 యూనిట్లు.. రూ. 11.61 కోట్లు సబ్సిడీ
- ఈనెల 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
యాదాద్రి, వెలుగు : స్వయం ఉపాధి పొందుతున్న యువతకు ప్రభుత్వం ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా చేయూత ఇవ్వనుంది. ఇందుకోసం ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చర్ రంగంలో కొనసాగుతున్న యువతకు సబ్సిడీపై వెహికల్స్, సోలార్ పంపు సెట్లను అందించనుంది. స్విగ్గీ, జొమాటో తదితర సంస్థల్లో పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్న గిగ్‌వర్కర్లకు టూ వీలర్స్ అందించనుంది.
24 వరకు అప్లికేషన్లు స్వీకరణ
ఈవీ టూ వీలర్లు, ఆటోలతో పాటు సోలార్ పంపు సెట్ల కోసం ఆసక్తి కలిగిన యువత నుంచి ఈ నెల 24 వరకూ ఆన్లైన్లో tgobmms.cgg.gov.in అప్లికేషన్లు స్వీకరించనుంది. ఫొటోలతో కూడిన అప్లికేషన్‌తో ఆధార్, రేషన్‌కార్డ్, కుల, ఆదాయ సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థల్లో పని చేస్తున్న గిగ్ వర్కర్లతో పాటు టూ వీలర్‌పై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఎలక్ట్రికల్ టూ వీలర్‌కు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే టూ వీలర్, త్రీ వీలర్ ఎలక్ర్టానిక్ వెహికల్స్ కోసం అప్లయ్ చేసుకునే వారు శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.
సోలార్ పంపు కంట్రోల్ యూనిట్‌కోసం అప్లై చేసుకునే వారికి రెండు ఎకరాల భూమి కలిగి ఉండి పట్టాదారు పుస్తకం ఉండాలి. భూమిలో నీటి లభ్యత కలిగిన బోరు ఉన్నట్టు గ్రామ కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. టూ వీలర్, త్రీ వీలర్ కోసం 2025 జూలై 1 నాటికి 21-నుంచి 50 ఏండ్ల మధ్య వయసున్న వారు అప్లై చేసుకోవాలి. సోలార్ పుంపు యూనిట్లకు 21 నుంచి 60 ఏండ్ల వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి వార్షిక ఆదాయం 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. రెండు లక్షలకు మించి ఆదాయం ఉండరాదు. బ్యాంకు కాన్సెంట్ తప్పనిసరి ఉండాలి. ఒక రేషన్ కార్డుపై ఒకరు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే గడిచిన ఐదేండ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందినవారు ప్రస్తుతం ఆర్థిక సహాయం పొందడానికి
అనర్హులు.
70 నుంచి 90 శాతం సబ్సిడీ
స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థల్లో పని చేస్తున్న గిగ్ వర్కర్లతో పాటు టూ వీలర్‌పై చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి 90 శాతం సబ్సిడీతో రూ. లక్ష విలువైన ఎలక్ట్రికల్ టూ వీలర్ అందించనున్నారు. ఎలక్ర్టిక్ ఆటో ప్యాసింజర్, గూడ్స్ వాహనాల విలువ, ఒక్కొక్కటి రూ. 3 లక్షలు కాగా, 70శాతం రాయితీ ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 30 శాతం లబ్ధిదారుడు చెల్లించాలి.
సోలార్ యూనివర్శల్ పంపు కంట్రోల్యూనిట్లో ఒక్కొక్కటి రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది. యూనిట్ విలువను బట్టి రూ. 5 లక్షల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మిగతా సొమ్ము లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది.
ఉమ్మడి నల్గొండలో 929 యూనిట్లు
ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తంగా 929 మందికి లబ్ది కలగనుంది. మొత్తంగా వీరు రూ. 11,61,51,000 సబ్సిడీ పొందనున్నారు.
అప్లయ్ చేసుకోండి
స్వయం ఉపాధిలో కొనసాగుతున్న యువతకు చేయూతనిచ్చేందుకు సర్కారు ఎస్సీ యాక్ష్ ప్లాన్ అమలు చేస్తోంది. 70 నుంచి 90 శాతం సబ్సిడీపై టూ వీలర్లు, త్రీ వీలర్లు అందిస్తాం. అర్హులైన వారు అప్లయ్ చేసుకోండి.
-జినుకల శ్యాంసుందర్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ యాదాద్రి జిల్లా-
